
న్యూస్ డెస్క్: ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతి నాయకుడిలాగే, మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కూడా ఓటమికి సాకులు వెతుకుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో, పీకే మౌనం వీడి సంచలన ఆరోపణలు చేశారు.
తాను సేకరించిన అభిప్రాయాలకు, ఓటింగ్ సరళికి పొంతన లేదని చెబుతూ… ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని పీకే ఆరోపించారు. అయితే, తన ఆరోపణలకు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని ఆయనే అంగీకరించడం గమనార్హం.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే మహిళలకు రూ. 10 వేలు అందజేశారని పీకే చెప్పుకొచ్చారు. వాస్తవానికి రూ. 2 లక్షలు అందాల్సి ఉండగా, మొదటి విడతగా రూ. 10 వేలు అందడంతో, మిగిలిన డబ్బుల కోసం ఓటర్లు ఎన్డీయేకే ఓటు వేశారని ఆయన విశ్లేషించారు.
అంతేకాదు, ప్రచారం చివరి దశలో… జన్ సురాజ్ గెలిచే స్థితిలో లేదని భావించిన కొంతమంది ఓటర్లు, ఆర్జేడీ ‘జంగిల్ రాజ్’ తిరిగి వస్తుందనే భయంతో తమకు దూరమయ్యారని లాలూ ప్రసాద్‌పై పరోక్షంగా నింద మోపారు.
మరికొందరైతే.. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పలు పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించానని చెప్పుకునే పీకే, సొంత పార్టీని డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దయనీయ స్థితి నుంచి కాపాడుకోలేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల మనసులు గెలుచుకోకుండా, తన ఓటమికి ఇతరులపై నిందలు వేయడం ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పీకే కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా ప్రజాక్షేత్రంలో అసలైన రాజకీయాన్ని నేర్చుకోవాలని ఆశిస్తున్నారు.
