
న్యూస్ డెస్క్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం ఆరంభంలోనే అడ్డంకులను ఎదుర్కొంటోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన ‘జన్ సురాజ్’ పార్టీని నిలబెట్టినా, ఇప్పుడు సొంత అభ్యర్థులే నామినేషన్లు ఉపసంహరించుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దానాపూర్, బ్రహ్మపూర్, గోపాల్‌గంజ్ స్థానాల అభ్యర్థులు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
ఈ అనూహ్య పరిణామం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందని ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తమ అభ్యర్థులను బెదిరించి, బలవంతంగా నామినేషన్లు విత్‌డ్రా చేయించారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా, గోపాల్‌గంజ్ అభ్యర్థి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ తప్పుకోవడం బీజేపీ కుట్రేనని ఆయన ఆరోపించారు.
అయితే, పీకే ఆరోపణలపై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సొంత అభ్యర్థులకే రక్షణ కల్పించుకోలేని వ్యక్తి, రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. “ఈ మాత్రం దానికి పార్టీ పెట్టడం, రాజకీయాల్లోకి రావడం ఎందుకు?” అంటూ సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి, ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకపోవడంపై ముందే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అభ్యర్థుల ఉపసంహరణతో, ఇది వ్యూహాత్మక వెనుకడుగా కాకుండా, ఆయన బలహీనతగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే ఒత్తిడికి తలొగ్గారా అన్నది తేలడం లేదు.
ఈ వివాదం బీహార్ ఎన్నికల వేడిని మరింత పెంచింది. 243 స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓవైపు ఎన్డీఏ కూటమి బలంగా ఉండగా, ‘ఇండియా’ కూటమి చీలిపోయి విడివిడిగా పోటీ చేస్తోంది. ఈ గందరగోళం ఎన్డీఏకు లాభించేలా ఉంది.
ఇలాంటి కీలక తరుణంలో, ప్రశాంత్ కిషోర్ తన అభ్యర్థులను కాపాడుకోలేకపోవడం ఆయన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. మార్పు తెస్తానని పాదయాత్ర చేసిన పీకే, ఆరంభంలోనే ఇలా తడబడటం ఆయన పార్టీ భవిష్యత్తుపైనే ప్రశ్నార్థకంగా మారింది.
