
దర్శకుడిగా రెండు, హీరోగా రెండు.. కేవలం నాలుగు చిత్రాల అనుభవంతోనే సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్. ఈ కుర్రాడికి ఏర్పడిన ఫాలోయింగ్, మార్కెట్ చూసి ట్రేడ్ పండితులు సైతం షాక్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ వస్తే వందల కోట్లు కొల్లగొట్టే స్థాయికి ఆయన క్రేజ్ చేరుకుంది.
దీనికి తాజా ఉదాహరణ ‘డ్యూడ్’. ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా తొలిరోజు రూ. 22 కోట్లు రాబట్టడం కోలీవుడ్‌లో పెను సంచలనం. స్టార్ హీరోలకు మినహా, మిడ్ రేంజ్ హీరోలకు కూడా సాధ్యం కాని ఓపెనింగ్ ఇది.
‘కోమాలి’తో దర్శకుడిగా పరిచయమై, ఆ తర్వాత గ్యాప్ రావడంతో తనే హీరోగా ‘లవ్ టుడే’ తీశాడు. ఆ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘డ్రాగన్’ ఏకంగా రూ. 140 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
లుక్స్ పరంగా చాలా సాధారణంగా కనిపించినా, ప్రదీప్ తన నటన, విలక్షణమైన స్టైల్‌తో యువతను కట్టిపడేస్తున్నాడు. ‘డ్యూడ్‘ వంటి బలహీనమైన కథను కూడా నిలబెట్టగలిగాడంటే, అది కేవలం అతని పెర్ఫార్మెన్స్, స్టార్‌డమ్ వల్లే సాధ్యమైంది.
అయితే, ఈ అనూహ్యమైన స్టార్‌డమ్ ఇప్పుడు ప్రదీప్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అతనిపై అంచనాలు ఆకాశాన్ని అంటడంతో, భవిష్యత్తులో కథల ఎంపిక, హిట్లు కొట్టడం అతనికి కత్తి మీద సాములాంటిదే.
కానీ, ప్రదీప్ స్వతహాగా దర్శకుడు, రచయిత కావడం అభిమానులకు పెద్ద ప్లస్ పాయింట్. మంచి జడ్జిమెంట్‌తో, జాగ్రత్తగా అడుగులు వేస్తాడని, ఈ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటాడని వారు బలంగా నమ్ముతున్నారు.
