
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది‘ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాను దర్శకుడు బుచ్చిబాబు ఏ విషయంలోనూ రాజీ పడకుండా, భారీ స్థాయిలో చెక్కుతున్నారు.
సినిమా స్థాయికి తగ్గట్టే, కాస్టింగ్ విషయంలోనూ బుచ్చిబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను, ఓ కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు, ఈ భారీ తారాగణంలోకి మరో సీనియర్ స్టార్ వచ్చి చేరారు. లెజెండరీ నటి శోభన ‘పెద్ది’లో ఓ అత్యంత భావోద్వేగమైన, కీలక పాత్రను పోషించనున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘రుద్రవీణ’, ‘రౌడీ అల్లుడు’ వంటి క్లాసిక్ హిట్స్‌లో నటించిన శోభన, ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించనుండటం ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తోంది.
పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చినా అంగీకరించని శోభన, చాలా కాలం తర్వాత ‘పెద్ది’తో టాలీవుడ్‌కు రీ-ఎంట్రీ ఇస్తుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. బుచ్చిబాబు తన కాస్టింగ్‌తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నాయి. సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
