
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా కొనసాగాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ లక్ష్యం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడతామని ఆయన స్పష్టం చేశారు. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబు అని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేసి, వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామని పవన్ అన్నారు.
పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్మయోగిగా అభివర్ణించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోదీని కర్మయోగి అంటామని చెప్పారు. ఆయన ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, రెండు తరాలను నడుపుతున్నారని ప్రశంసించారు. దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో, అదేవిధంగా భారతదేశాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని కొనియాడారు.
పన్నుల భారం తగ్గదని అందరూ అనుకుంటున్న సమయంలో, పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చారని పవన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేలు ఆదా చేసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలోని నన్నూరు చెక్‌పోస్ట్ వద్ద ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో ఈ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ సభలో ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ. 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు ప్రధాని మోడీని కొనియాడుతూ, కూటమి ఐక్యత విషయంలో తన కోరికను పవన్ కల్యాణ్ మరోసారి వ్యక్తపరిచారు.
