Saturday, October 3, 2026
HomeAndhra Pradeshఆ ఎమ్మెల్యేపై పవన్‌కు కోపం? ఏం జరిగింది?

ఆ ఎమ్మెల్యేపై పవన్‌కు కోపం? ఏం జరిగింది?

pawan-kalyan-angry-on-bhimavaram-dsp-mla-support

న్యూస్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయాల్లో ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ వివాదాస్పద డీఎస్పీకి సదరు ఎమ్మెల్యే అండగా నిలవడమే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కూటమిలో పెద్ద చర్చకు దారితీసింది.

అసలు వివాదం భీమవరం సబ్ డివిజన్ పరిధిలోని పేకాట శిబిరాలతో మొదలైంది. జూదం కారణంగా తమ కుటుంబాలు నాశనమవుతున్నాయంటూ బాధితులు నేరుగా పవన్‌ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ దందాపై తక్షణమే ఉక్కుపాదం మోపాలని వారు డిప్యూటీ సీఎంను కోరారు.

ఈ విషయంపై స్పందించిన పవన్, స్థానిక డీఎస్పీ జయసూర్యకు పార్టీ శ్రేణుల ద్వారా సందేశం పంపారు. అయినప్పటికీ ఆ అధికారి ఉదాసీనంగా వ్యవహరించడం, పేకాట శిబిరాలను అరికట్టకపోవడంతో పవన్ తీవ్ర సీరియస్ అయ్యారు.

సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఆదేశాలనే ఓ డీఎస్పీ ఎందుకు లెక్కచేయడం లేదన్న దానిపై ఆరా తీయగా, ఆయన వెనుక ఓ కీలక కూటమి ఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ఎమ్మెల్యే అండతోనే ఆ డీఎస్పీ తన బదిలీని సైతం ఆపించుకున్నారని, అందుకే ఎవరినీ లెక్కచేయడం లేదని సమాచారం.

ఈ వ్యవహారంతో జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలపై చర్చ మొదలైంది. ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు, మంత్రి నిమ్మల రామానాయుడు కాకుండా, మిగిలిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు (రఘురామ, పితాని, రాధాకృష్ణ)లో ఆ నేత ఎవరై ఉంటారన్నది కూటమిలో పెద్ద డిబేట్‌గా మారింది.

అయితే, పవన్ కల్యాణ్ మిత్రపక్ష ఎమ్మెల్యేతో నేరుగా విభేదించడం ఇష్టం లేక, ఈ విషయాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. నేరుగా డీజీపీకి, హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసి, డీఎస్పీపై విచారణకు ఆదేశింపజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular