
న్యూస్ డెస్క్: భారత్ పాకిస్థాన్ మధ్య సింధు నది జలాల ఒప్పందంపై మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా భారత్‌ను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన ఒక్క నీటి చుక్కను కూడా శత్రువులు లాక్కోలేరని ఆయన హెచ్చరించారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో షరీఫ్ మాట్లాడుతూ, “మా నీటిని అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, వారు గట్టి గుణపాఠం నేర్చుకుంటారు” అని అన్నారు. ఇది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ 1960 సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన నిర్ణయానికి ప్రతిస్పందనగా వచ్చిన వ్యాఖ్య.
ఈ వివాదంపై పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “భారత్ డ్యామ్ కడితే కూల్చివేస్తాం, సింధు నది భారత ఆస్తి కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను “అణు బ్లాక్‌మెయిల్”గా అభివర్ణించింది. ఉగ్రవాద గ్రూపులతో కుమ్మక్కైన పాకిస్థాన్ సైన్యం చేతిలో అణ్వాయుధాలు సురక్షితంగా లేవని ఈ ప్రకటనలు నిరూపిస్తున్నాయని పేర్కొంది.
అమెరికా మిత్రదేశం భూభాగం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం విచారకరమని భారత విదేశాంగం తెలిపింది. పాక్ మాజీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలకు బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఘాటుగా ప్రతిస్పందించారు.
శాంతిని ప్రేమించే పాకిస్థాన్ ప్రజలతో భారత్‌కు విరోధం లేదని, కానీ అక్కడి నాయకులకు తగిన సమాధానం ఇస్తామని ఆయన చెప్పారు. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది.
