
ఇటీవల కాలంలో ‘జెన్-జెడ్’ (Gen-Z) ఉద్యమాలు ప్రభుత్వాలనే కూల్చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా, నేపాల్‌లో కేపీ శర్మ ఓలి ప్రభుత్వాలు యువత నిరసనల దెబ్బకు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ‘జెన్-జెడ్’ సెగ పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) మీదుగా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు తగులుతోంది.
పీఓకేలో ప్రస్తుతం పరిస్థితులు అగ్నిగుండంలా మారాయి. విద్యా సంస్కరణలు, పెరిగిన ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన శాంతియుత నిరసన, ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపుదాల్చింది.
ముజఫరాబాద్‌లోని ఓ యూనివర్సిటీలో మొదలైన ఈ ఉద్యమం, ఓ విద్యార్థిపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారింది. ఆగ్రహించిన విద్యార్థులు టైర్లను తగలబెడుతూ, విధ్వంసం సృష్టిస్తూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
నేపాల్‌లో యువత ఏకంగా మంత్రుల ఇళ్లను, పార్లమెంట్‌ను తగలబెట్టిన ఘటన ఇంకా కళ్లముందే ఉంది. బంగ్లాదేశ్‌లోనూ విద్యార్థి ఉద్యమం ప్రభుత్వాన్నే పడగొట్టింది. ఇప్పుడు పీఓకేలో మొదలైన ఈ ‘జెన్-జెడ్’ నిరసనలు, షరీఫ్-మునీర్ ద్వయం గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
గతంలోనూ పీఓకేలో ఫీజుల పెంపుపై నిరసనలు జరిగినా, ఈసారి మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఉద్యమం ఎలాంటి మలుపు తీసుకుంటుందో, పాకిస్థాన్ రాజకీయాలపై ఎంతటి ప్రభావం చూపుతుందోనని అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
