
తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు పా. రంజిత్, ఇటీవల కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘కబాలి’, ‘కాలా’, ‘సార్పట్ట పరంపరై’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన సినిమాల్లో తరచుగా కుల వివక్ష అంశాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇదే తరహాలో సినిమాలు తీస్తున్న మరికొందరు దర్శకులతో కలిపి, తమ వల్లే తమిళ సినిమా వెనుకబడిపోతోందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో, తాను నిర్మించిన ‘బైసన్’ చిత్రం విజయోత్సవ సభలో రంజిత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “కాంతార లాంటి సినిమా హిట్టయితే చాలు, తమిళంలో అలాంటివి రావడం లేదని, దానికి మేమే కారణమని విమర్శిస్తున్నారు. ఇది అన్యాయం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“నేను పదేళ్లలో తీసింది ఏడు సినిమాలే. మారి సెల్వరాజ్ ఐదు తీశాడు. వెట్రిమారన్ మూడేళ్లకు ఒకటి తీస్తాడు. కానీ, మా ముగ్గురి వల్లే తమిళ సినిమా దెబ్బతింటోందని అంటున్నారు” అని రంజిత్ ప్రశ్నించారు. తమిళంలో ఏటా 250-300 సినిమాలు వస్తున్నాయని, గత రెండేళ్లలో 600 చిత్రాలు విడుదలయ్యాయని గుర్తుచేశారు.
“మరి ఆ సినిమాలేవీ ఎందుకు భారీ విజయాలు సాధించడం లేదు? మిగతా దర్శకులంతా ఏం చేస్తున్నారు? ఆ సినిమాలను తమిళ ప్రేక్షకులు ఎందుకు పెద్ద హిట్ చేయలేకపోయారు? కేవలం మమ్మల్ని మాత్రమే ఎందుకు వేలెత్తి చూపుతున్నారు?” అంటూ రంజిత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తాము వాస్తవ సమస్యలను, ప్రజల జీవితాలను ప్రతిబింబించే సినిమాలు తీస్తున్నామని, దానిని తప్పుబట్టడం సరికాదని ఆయన అన్నారు. భారీ వసూళ్లు రాకపోవడానికి తమను బాధ్యులను చేయడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు.
సమాజంలోని అసమానతలపై సినిమాలు తీస్తున్న దర్శకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మానుకోవాలని, అన్ని రకాల కథలను ఆదరించాలని ఆయన పరోక్షంగా తమిళ ప్రేక్షకులకు, విమర్శకులకు సూచించారు.
