
న్యూస్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో మరో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ కుట్రలో భాగంగా సీజ్ చేసిన భారీ పేలుడు పదార్థాలు శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో పేలాయి. ఈ దుర్ఘటనలో 8 మంది పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, మృతదేహాల భాగాలు 300 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
ఫరీదాబాద్ మాడ్యూల్ నుంచి స్వాధీనం చేసుకున్న 360 కిలోల పేలుడు పదార్థాలను ఈ పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచారు. శుక్రవారం రాత్రి 11:22 గంటల సమయంలో, ఫోరెన్సిక్ బృందం ఈ పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా ఈ భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను పోలీస్ స్టేషన్‌లో ఎందుకు నిల్వ ఉంచారు? సీజ్ చేసి చాలా రోజులు గడుస్తున్నా, అర్ధరాత్రి వేళ శాంపిల్స్ ఎందుకు సేకరించాల్సి వచ్చింది? అనే కోణంలో విచారణ జరుగుతోంది.
ఇటీవలే ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడు (9 మంది మృతి) ఘటనకు కూడా ఇదే ఫరీదాబాద్ మాడ్యూల్ కారణమని తేలింది. ఆ ఉగ్రకుట్రను భగ్నం చేశామన్న సంతోషం, ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ పేలుడుతో ఆవిరైంది.
