
న్యూస్ డెస్క్: మన సౌర వ్యవస్థలోకి దూసుకొస్తున్న ‘3I/ATLAS’ అనే వింత అంతరిక్ష వస్తువు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలను ఉత్కంఠకు గురిచేస్తోంది. నక్షత్రాల మధ్య నుంచి (ఇంటర్‌స్టెల్లార్) వచ్చిన ఈ తోకచుక్క లాంటి వస్తువు, డిసెంబర్ 19, 2025న భూమికి అత్యంత సమీపంగా రానుండటంతో నాసా హైఅలర్ట్ ప్రకటించింది. దీని విచిత్రమైన లక్షణాలు, అది గ్రహాంతరవాసుల ప్రోబ్ అయి ఉండవచ్చనే సంచలన సిద్ధాంతాలు ఈ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.
జూలై 1న చిలీలోని నాసా ATLAS టెలిస్కోప్ ద్వారా తొలిసారిగా గుర్తించిన ఈ ‘3I/ATLAS’, సాధారణ తోకచుక్కలకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. దీని కక్ష్య అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి కక్ష్యలతో దాదాపు సరిపోవడం, సూర్యుడి వైపు కాకుండా వ్యతిరేక దిశలో పదార్థాన్ని విడుదల చేయడం (ఇంజిన్ లాగా), నికెల్ అధికంగా ఉండటం, నీటి శాతం కేవలం 4% మాత్రమే ఉండటం, కాంతిని వింతగా పరావర్తనం చెందించడం వంటి లక్షణాలు దీనిని ఓ మిస్టరీగా మార్చాయి. నవంబర్ 29న ఇది సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లనుంది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అవీ లోబ్ ఈ వస్తువుపై మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది సహజ సిద్ధమైన తోకచుక్క కాదని, గ్రహాంతర నాగరికత పంపిన కృత్రిమ వస్తువు (ప్రోబ్) అయి ఉండవచ్చని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. 1977 నాటి “Wow! Signal” తరహా రేడియో తరంగాలు కూడా దీని నుంచి వెలువడుతున్నాయని ఆయన పేర్కొనడం ఈ సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది. ఈ వాదనలు ప్రపంచ అంతరిక్ష సంస్థలను అప్రమత్తం చేశాయి.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), చైనా స్పేస్ ఏజెన్సీ అన్నీ దీని కదలికలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ వార్నింగ్ నెట్‌వర్క్ (IAWN) దీనిపై ప్రత్యేక అధ్యయనాన్ని ప్రారంభించింది. నవంబర్ 27 నుంచి జనవరి 27 వరకు ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు జరపనున్నారు. ప్రస్తుతం ఇది అంగారకుడికి (Mars) 29 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్స్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ల ద్వారా దీనికి సంబంధించిన కీలక డేటా లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
ప్రస్తుతానికి ‘3I/ATLAS’ కక్ష్య భూమిని నేరుగా ఢీకొట్టేలా లేదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిసెంబర్ 19న ఇది భూమికి సురక్షితమైన దూరంలోనే ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీని కదలికలు ఊహించలేనివి కావడంతో, పూర్తి భరోసా ఇవ్వలేమని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు స్పష్టం చేశారు.
ఈ వస్తువు నిజ స్వరూపం ఏమిటి? ఇది సహజ తోకచుక్కా లేక గ్రహాంతర నౌకా? అనే ప్రశ్నకు సమాధానం డిసెంబర్ 19 తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ప్రొఫెసర్ లోబ్ వాదనే నిజమైతే, ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద అంతరిక్ష ఆవిష్కరణగా నిలిచిపోతుంది.
