
న్యూస్ డెస్క్: రాజకీయాల్లో బిజీగా ఉండే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమయం దొరికితే చాలు బ్యాట్ పడతారు, లేదా క్రికెటర్లను కలుస్తుంటారు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెటర్లను సత్కరించిన ఆయన, తాజాగా మరో ఆసక్తికర భేటీతో వార్తల్లో నిలిచారు.
సాక్షాత్తు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా ఈ కలయిక జరిగింది. మాస్టర్ బ్లాస్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన లోకేశ్, ఆయనతో కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం క్రీడా, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు సచిన్ పుట్టపర్తికి విచ్చేశారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న లోకేశ్, సచిన్‌ను కలిసి సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీ పూర్తిగా ఆత్మీయ వాతావరణంలో సాగింది. సచిన్‌ను కలవడం పట్ల లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.
వీరిద్దరి మధ్య కేవలం కుశల ప్రశ్నలే కాకుండా, కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏపీలో క్రీడల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టాలెంట్ గురించి లోకేశ్ ప్రస్తావించారు. సచిన్ తన కెరీర్‌లోని మధుర క్షణాలను లోకేశ్‌తో పంచుకున్నారు.
ఆటతో పాటు ఆధ్యాత్మికత కూడా వీరి చర్చలో భాగమైంది. సత్యసాయి బాబా బోధనలు, ఆయన సమాజానికి చేసిన సేవలను ఇరువురూ గుర్తుచేసుకున్నారు. బాబా చూపిన సేవా మార్గం, మానవతా విలువలపై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు లోకేశ్ స్వయంగా వెల్లడించారు.
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ క్రమంలో సచిన్ వంటి లెజెండ్‌తో మంత్రి లోకేశ్ భేటీ కావడం, రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఏపీ క్రీడాభివృద్ధికి సచిన్ సలహాలు ఉపయోగపడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
