
న్యూస్ డెస్క్: కూటమి మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు నాయుడుకు రాజకీయ వారసుడు అయిన లోకేష్.. పాలనలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
గతంలో ఏపీ కోసం నిధులు అడగడానికి చంద్రబాబు ఐదేళ్లలో 29 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడా బాధ్యతలను లోకేష్ పంచుకుంటూ ప్రతి నెలకు నెలన్నరకు ఢిల్లీకి వెళ్తున్నారు. తాజాగా మోంథా తుఫాన్ సాయం కోసం లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక ఇచ్చారు.
పనిలో పనిగా పలువురు కేంద్ర మంత్రులను కలసి ఏపీ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కోరుతున్నారు. ఈ విధంగా కేంద్రం దృష్టిలో ఏపీని ఉంచే బృహత్ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగిస్తున్నారు.
దీనితో కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం లోకేష్‌కి ఎంతో విలువ గౌరవం ఇస్తున్నారు. ఆయన విన్నపాలను మన్నిస్తున్నారు. కేంద్ర పెద్దలు బీజేపీ ముఖ్యులు లోకేష్‌ను కీలక నేతగానే చూస్తున్నారు.
ఢిల్లీ వర్గాలలో వినిపిస్తున్న గుసగుస ప్రకారం.. లోకేష్‌ను ఏపీ ఫ్యూచర్ లీడర్‌గా భావిస్తున్నారు. ఏణ్ణర్థం వ్యవధిలోనే మంచి నేతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా యువ నాయకుడిగా కేంద్ర పెద్దల వద్ద మంచి మార్కులు సంపాదించారు.
ఢిల్లీలో పనులు చక్కబెట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ లోకేష్ మాత్రం చంద్రబాబు మాదిరిగా ఢిల్లీలోనూ పట్టు సాధిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. సరైన సమయంలోనే అన్నీ జరుగుతాయని లోకేష్ వర్గాలు చెబుతున్నాయి.
