
న్యూస్ డెస్క్: దేశంలో మైనర్ల ఆస్తి హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. మైనర్‌గా ఉన్నప్పుడు వారి సంరక్షకులు (తల్లిదండ్రులు లేదా ఇతరులు) కోర్టు అనుమతి లేకుండా అమ్మిన ఆస్తులను, వారు మేజర్లు (18 ఏళ్లు నిండిన తర్వాత) అయ్యాక తిరస్కరించే పూర్తి హక్కు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వేలాది ఆస్తి వివాదాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ తీర్పు వెనుక కర్ణాటకకు చెందిన ఓ కేసు నేపథ్యం ఉంది. శామనూరు గ్రామానికి చెందిన రుద్రప్ప అనే వ్యక్తి 1971లో తన ముగ్గురు మైనర్ కుమారుల పేరు మీద కొంత భూమి కొన్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత కోర్టు అనుమతి లేకుండానే ఆ భూమిని ఆయన ఇతరులకు విక్రయించారు.
కాలక్రమేణా, రుద్రప్ప కుమారులు మేజర్లు అయ్యారు. వారికి తెలియకుండా తమ తండ్రి అమ్మేసిన అదే ఆస్తిని వారు కే.ఎస్. శివప్ప అనే మరో వ్యక్తికి విక్రయించారు. దీంతో, గతంలో రుద్రప్ప వద్ద భూమి కొన్న పాత కొనుగోలుదారులు, తమకే హక్కులు ఉన్నాయంటూ కోర్టుకెక్కారు. ఈ వివాదం వివిధ న్యాయస్థానాల సుప్రీంకోర్టుకు చేరింది.
జస్టిస్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి కీలక తీర్పునిచ్చింది. మైనర్‌గా ఉన్నప్పుడు సంరక్షకుడు కోర్టు అనుమతి లేకుండా చేసిన ఆస్తి విక్రయాన్ని, ఆ మైనర్ మేజర్ అయ్యాక రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇందుకోసం వారు ప్రత్యేకంగా దావా వేయాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పింది.
ఆ ఆస్తి విక్రయం గురించి వారికి తెలియకపోవచ్చని, కాబట్టి మేజర్ అయ్యాక వారు నేరుగా ఆ లావాదేవీని సవాలు చేయవచ్చని, తమ ఆస్తిని తమ ఇష్టానుసారం ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా తిరిగి తమ పేరు మీదకు బదిలీ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ తీర్పుతో, మైనర్ల ఆస్తులను వారి సంరక్షకులు దుర్వినియోగం చేయడానికి, దోపిడీ చేయడానికి అడ్డుకట్ట పడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ తీర్పు నిలువరిస్తుందని, ఇది మైనర్ల ఆస్తి హక్కుల పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని వారు పేర్కొంటున్నారు.
