
న్యూస్ డెస్క్: పీఎన్‌బీ కుంభకోణం సూత్రధారి, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి బెల్జియం కోర్టులో చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించవద్దన్న ఆయన అభ్యర్ధనను న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన అప్పగింతకు ఆమోదం తెలుపుతూ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇది సబబేనని వ్యాఖ్యానించింది.
విచారణలో ఛోక్సీ వాదిస్తూ, తన అప్పగింత రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ముఖ్యంగా, భారత్‌లోని జైళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుందని, అక్కడి జుగుప్సాకరమైన గదుల్లో తాను అనారోగ్యం బారిన పడతానని ఆందోళన వ్యక్తం చేశారు.
ఛోక్సీ వాదనలను బెల్జియం కోర్టు కొట్టిపారేసింది. భారత్‌లో ఆయనకు అన్యాయం జరగదని స్పష్టం చేసింది. ఆయన కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక సెల్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించింది.
భారత దర్యాప్తు సంస్థలు అందించిన వివరాలను కోర్టు ప్రస్తావిస్తూ, ఆ గది సౌకర్యాలను వివరించింది. బ్యారక్ నెం. 12లో 46 చ.మీ. విస్తీర్ణంలో రెండు ప్రత్యేక గదులు కేటాయించారని, ప్రైవేట్ టాయిలెట్ సౌకర్యం ఉందని తెలిపింది.
అంతేకాదు, గాలి, వెలుతురు కోసం మూడు కిటికీలు, ఐదు వెంటిలేటర్లు, మూడు ఫ్యాన్లు, ఆరు ట్యూబ్ లైట్లు ఉన్నాయని పేర్కొంది. ఛోక్సీ వార్తలు, వినోదం చూసేందుకు ప్రత్యేకంగా కొత్త టీవీని కూడా అమర్చారని కోర్టు వివరించింది.
ఆసుపత్రి లేదా కోర్టు విచారణకు తప్ప, ఇతర కారణాలతో ఛోక్సీని బయటకు తీసుకెళ్లబోరని హామీ లభించింది. ఈ వివరాలతో సంతృప్తి చెందిన న్యాయస్థానం, అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
