
వరుస పరాజయాల తర్వాత, మాస్ మహారాజా రవితేజ తన 75వ చిత్రంగా ‘మాస్ జాతర‘తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘సామజవరగమన’ రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా, రవితేజకు అవసరమైన విజయాన్ని అందించిందా? లేదా? చూద్దాం.
కథ:
వరంగల్‌లో ముక్కుసూటిగా పనిచేసే రైల్వే పోలీస్ ఎస్ఐ లక్ష్మణ్ భేరి (రవితేజ), తన వైఖరి వల్ల శ్రీకాకుళం మన్యం ప్రాంతానికి బదిలీ అవుతాడు. ఆ ప్రాంతాన్ని గంజాయి వ్యాపారంతో ఏలుతున్న శివుడు (నవీన్ చంద్ర)తో లక్ష్మణ్‌కు ఘర్షణ మొదలవుతుంది. తన సామ్రాజ్యానికి అడ్డువచ్చిన లక్ష్మణ్‌ను శివుడు ఏం చేశాడు? బాధితుల కోసం నిలబడ్డ లక్ష్మణ్, ఆ మాఫియాను ఎలా అంతం చేశాడు? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:
రవితేజ లాంటి మాస్ హీరో సినిమా నుంచి ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశించరు. టెంప్లేట్ కథే అయినా, మాస్ ఎలివేషన్లు, యాక్షన్, ఎమోషన్ పండితే చాలు. దర్శకుడు భాను భోగవరపు కూడా ‘క్రాక్’ ఫార్ములాను నమ్ముకుని, రవితేజను మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. కానీ, కొన్ని ఎపిసోడ్లు మినహా, సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేయలేకపోయింది.
‘సామజవరగమన’ లాంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు పనిచేసిన రచయిత కావడంతో, భాను కామెడీపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ సినిమాలో అదే పెద్ద మైనస్. రాజేంద్ర ప్రసాద్ పాత్రతో చేయించిన కామెడీ, శ్రీలీల ట్రాక్, హైపర్ ఆది పంచ్‌లు ఏవీ నవ్వు పుట్టించలేదు. కామెడీపై ఎక్కువ దృష్టి పెట్టి, అందులో ఫెయిల్ అవ్వడం సినిమాకు దెబ్బతీసింది.
అయితే, దర్శకుడు రవితేజ మాస్ ఇమేజ్‌ను వాడుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌లో కొన్ని కీలక యాక్షన్ ఘట్టాలు బాగా పేలాయి. విలన్ తన ‘ఫ్యామిలీ’తో శిక్షలు అమలుచేసే ట్రాక్ కాస్త కొత్తగా, ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ ఒక్క ట్రాక్‌లోనే డెబ్యూ డైరెక్టర్ స్పార్క్ కనిపించింది.
రైల్వే ఎస్ఐగా కొత్త నేపథ్యం తీసుకున్నా, దాన్ని పెద్దగా వాడుకోలేదు. ఫస్టాఫ్ రొటీన్‌గా, నెమ్మదిగా సాగడం మైనస్. సెకండాఫ్ కాస్త ఊపందుకున్నా, మొత్తం మీద సినిమా ఒక టెంప్లేట్ ఫార్ములాలోనే సాగుతుంది. కొన్ని మాస్ సీన్లు, పాటల కోసం సంతృప్తి పడితే ‘మాస్ జాతర’ ఓకే అనిపిస్తుంది, అంతకుమించి ఆశిస్తే నిరాశ తప్పదు.
ప్లస్ పాయింట్స్:
- రవితేజ ఎనర్జీ, లుక్స్
- యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ, కథనం
- పూర్తిగా విఫలమైన కామెడీ
- ప్రాధాన్యత లేని శ్రీలీల పాత్ర
- ఊహించదగిన సన్నివేశాలు
