
తెలంగాణ: కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తన ఢిల్లీ పర్యటనలో కీలక కార్యక్రమాలను పూర్తి చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబసభ్యులతో కలిసి కలిసిన ఆయన, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్, టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
కేబినెట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని రాహుల్‌ను కోరినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు. రాహుల్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించారని, త్వరలోనే కేబినెట్‌లోనూ కీలక మార్పులు ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై కూడా వీరిద్దరూ మంతనాలు జరిపినట్లు తెలిసింది. టీపీసీసీ పునర్నిర్మాణం, పార్టీ కేడర్ పునర్వ్యవస్థీకరణ, జిల్లా స్థాయిలో బలమైన నేతల్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని మహేశ్ గౌడ్ చెప్పారు.
‘జై బాపు – జై భీమ్’ వంటి ప్రజా కార్యక్రమాలకు రాహుల్ అభినందనలందించినట్లు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో టీపీసీసీ కార్యవర్గం జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఆశీస్సులతో మహేశ్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్‌కు ఊపును తీసుకొచ్చే దిశగా నడుస్తున్నారు.
