
యానిమేషన్ సినిమాల విషయంలో ఇండియన్ సినిమా ఇప్పుడు కొత్త దిశగా ప్రయాణిస్తోంది. ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహా అనే యానిమేషన్ చిత్రం అందుకు పెద్ద ఉదాహరణ. హొంబాలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి యానిమేషన్ సినిమాలకి పునర్జన్మ ఇచ్చింది.
ఒక యానిమేషన్ సినిమానే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించటం అసాధారణమే. దీంతో సినిమా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అశ్విన్ కుమార్ “ఇది యునానిమస్ రెస్పాన్స్, చాలా స్పెషల్” అని వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు మేకర్స్ చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ ఉంది. అదే మహావతార్ పరశురాముడు. ఈ సినిమాలో పరశురాముడి వైష్ణవ రూపం మరింత ఉగ్రంగా ఉండబోతోందని, ముందు సినిమా కన్నా భారీగా ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
హొంబాలే ఫిలింస్ యానిమేషన్ విభాగాన్ని ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. “ఈసారి థియేటర్లు కంపించాల్సిందే” అని దర్శకుడు ధీమాగా చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
