
తమిళ నటుడు విశాల్‌కు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాతో ఉన్న ఆర్థిక వివాదంలో మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన ఘాటు వ్యాఖ్యలతో విశాల్ తరఫు న్యాయవాది నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది.
విశాల్ తన ఫిలిం ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ అన్బుచెళియన్ నుంచి తీసుకున్న రూ. 21.29 కోట్ల అప్పును లైకా సంస్థ చెల్లించింది. బదులుగా, ఆ అప్పు తీరేవరకు తన సినిమాల హక్కులను లైకాకు ఇవ్వాలని విశాల్ డీల్ చేసుకున్నారు.
అయితే, ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించారని లైకా సంస్థ కేసు దాఖలు చేసింది. దీనిపై సింగిల్ జడ్జి.. 30 శాతం వడ్డీతో కలిపి రూ. 21.29 కోట్లు చెల్లించాలని విశాల్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ విశాల్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో తాను ధనవంతుడిని కాదని, ఇంత భారీ వడ్డీ చెల్లించలేనని పేర్కొన్నారు.
దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుని, “అయితే, విశాల్‌ను దివాలా తీసిన వ్యక్తిగా (Bankrupt) ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు విశాల్ తరఫు న్యాయవాది ఖంగుతిన్నారు.
దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. 30 శాతం వడ్డీ అత్యధికమని, ఇలా దోచుకోవడానికి తాము అనుమతించమన్నారు. 30 శాతం వడ్డీతో చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుపై స్టే ఇస్తూ, విశాల్‌కు తాత్కాలిక ఊరట కల్పించింది.
