
న్యూస్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమేయం వరకు చేరాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన సంచలన ఆరోపణలు కాంగ్రెస్‌లో పెద్ద దుమారం రేపాయి. “మా అమ్మను టార్గెట్ చేస్తున్నారు. బీసీ మంత్రి అయిన మా అమ్మపై కొందరు రెడ్డి మంత్రులు కుట్ర పన్నుతున్నారు,” అని సుస్మిత ఘాటుగా వ్యాఖ్యానించారు.
మాజీ ఓఎస్డీ సుమంత్‌పై కేసు నమోదైన నేపథ్యంలో, బుధవారం అర్ధరాత్రి పోలీసులు సురేఖ నివాసానికి చేరుకున్నారు. ఈ పరిణామం అర్ధరాత్రి హైడ్రామాకు దారితీసింది. పోలీసులు సరైన కారణాలు చూపకుండా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించగా, సుస్మిత వారిని అడ్డుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.
సుస్మిత తన ఆరోపణల్లో సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోహిన్ రెడ్డి సహా పలువురు నేతల ప్రమేయం ఉందని నేరుగా పేర్లను ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. సుమంత్‌పై నమోదైన ఫిర్యాదులో ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు వినిపించినా, ఉత్తమ్ తనకు ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పడం ఈ కేసుపై అనుమానాలను మరింత పెంచింది.
పోలీసులు, మీడియా సమక్షంలో ఉద్రిక్తత నెలకొనగా, కొండా సురేఖ తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను తన కారులో తీసుకెళ్లిపోయినట్టు ప్రచారమైంది. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు, పార్టీ అంతర్గత సంక్షోభాన్ని మరోసారి బహిర్గతం చేసింది.
ఈ వివాదానికి మూలం మేడారం అభివృద్ధి పనుల టెండర్లే. వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేఖ శాఖకు చెందిన రూ. 71 కోట్ల విలువైన టెండర్లలో అతిగా జోక్యం చేసుకుంటున్నారని సురేఖ వర్గం ఆరోపించింది. దీంతో కొండా సురేఖ ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా లేఖ రాసినట్లు తెలుస్తోంది.
