
న్యూస్ డెస్క్: తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ముఖ్య నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నా ఇబ్బందులను, ఆలోచనలను పార్టీ పెద్దలతో పంచుకున్నాను.
వారు సమన్వయం చేస్తామని, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక నాకు పార్టీపై నమ్మకం ఉంది” అని తెలిపారు. ఈ ఘటనతో ఆమె గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు.
సురేఖ భర్త కొండా మురళి ఈ అంశంపై స్పందిస్తూ, “ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నేను అభిమానిస్తా. ఆయన సీఎం కావాలని నేను కోరుకున్నాను. ఎవరో మన మధ్య విరోధం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని తెలిపారు. ఏ విషయమైనా సీఎంను నేరుగా కలసి మాట్లాడుతానని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఎమ్మెల్సీ హామీపై తనకు విశ్వాసం ఉందన్నారు.
ఈ వివాదం బుధవారం రాత్రి మొదలైంది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై పోలీసులు చర్యలు చేపట్టడం, ఆయన కోసం ఏకంగా మంత్రి నివాసం వద్దకు పోలీసులు చేరుకోవడంతో పెద్ద వివాదానికి దారితీసింది. మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంట్లోకి వెళ్లడం, ఆమె కుమార్తె వారితో వాగ్వాదానికి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పోలీసుల చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలోని డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని సుమంత్ బెదిరించాడనే ఆరోపణలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రికి నివేదించారని తెలుస్తోంది. దీంతో సీఎం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
