
తెలంగాణ: కాంగ్రెస్‌లో ఇప్పుడు అంతా సీఎం రేవంత్ రెడ్డి టోన్ అందుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రమైన, ఘాటైన పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
సీఎం స్థాయిలో ఆయన వాడిన భాషపై కేటీఆర్ “సంస్కారం” అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు అదే “ఫైర్” బ్రాండ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందిపుచ్చుకోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గతంలో కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించిన కోమటిరెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతుగా బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. “అసెంబ్లీకే రాని కేసీఆర్, రెండేళ్లలో అధికారంలోకి ఎలా వస్తారు?” అని ఆయన ఎద్దేవా చేశారు.
అంతేకాదు, కేటీఆర్ తన సోదరి కవిత అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “కాళేశ్వరం, ధరణి పేర్లతో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంది. ఇప్పుడు ఆ దోచుకున్న సొమ్ము పంపకాలపై వారి కుటుంబంలోనే వాటాల పంచాయితీ నడుస్తోంది” అంటూ కోమటిరెడ్డి నిప్పులు చెరిగారు.
ఈ వ్యాఖ్యలను బట్టి, రేవంత్ రెడ్డి తన మంత్రులందరినీ ఏకతాటిపైకి తేవడంలో, ఒకే దూకుడు వ్యూహాన్ని అమలు చేయించడంలో సక్సెస్ అయ్యారని స్పష్టమవుతోంది.
