
న్యూస్ డెస్క్: మండల దీక్షల కోసం శబరిమల ఆలయం తలుపులు తెరుచుకున్న వేళ, కేరళ వైద్య ఆరోగ్య శాఖ అయ్యప్ప భక్తులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవల ‘ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్’ (PAM) అనే అరుదైన ‘బ్రెయిన్ ఫీవర్’ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ విడుదలైంది.
ఈ వ్యాధికి ‘నైగ్లేరియా ఫౌలెరీ’ అనే ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ కారణం. ఇది నదులు, చెరువులు వంటి నీటి వనరులలో ఉండవచ్చని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. భక్తులు పవిత్ర స్నానాలు చేసేటప్పుడు, ముఖ్యంగా పంప నదిలో మునిగినప్పుడు, నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే ఈ అమీబా మెదడుకు చేరి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.
అందువల్ల, అయ్యప్ప భక్తులు పంప నదిలో, ఇతర నీటి వనరులలో స్నానం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది. నీటిలో మునిగేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించింది.
దీక్షలో ఉన్న భక్తులు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని, ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించారు. బహిరంగ ప్రదేశాల్లోని ఆహారానికి దూరంగా ఉండాలన్నారు. నెమ్మదిగా కొండ ఎక్కాలని, అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
భక్తుల కోసం పంప నుంచి సన్నిధానం వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అత్యవసర కార్డియాలజీ సేవల కోసం పతనంతిట్టలో క్యాత్ ల్యాబ్‌ను సిద్ధం చేశారు. ఆరోగ్య సమస్యల కోసం 04735 203232 నంబర్‌ను సంప్రదించవచ్చు. భక్తుల సౌకర్యార్థం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
