
న్యూస్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును ఆపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర విచారణకు అంగీకరించకపోవడమే కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని కూడా కోర్టు తిరస్కరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా తీర్మానం కూడా చేశారు. దీని మరుసటి రోజే కేసీఆర్, హరీశ్‌లు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
విచారణ సందర్భంగా కోర్టు, ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే తీసుకుంటామని, రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రమేయం కూడా ఉన్నందున సీబీఐ విచారణే సరైనదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశాన్ని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వివరించి, తీర్మానం ఆమోదం పొందించారు.
ఇప్పటికి హైకోర్టు తీర్పు వెలువడకముందే, ఈ కేసు రాజకీయంగా హాట్‌టాపిక్ అయింది. రేపటి విచారణతో కేసీఆర్, హరీశ్ రక్షణ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
