
న్యూస్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, తన తండ్రి ఇంటిపేరును వదులుకోనున్నారా? ఇదిప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆమె, తన పుట్టింటి ఇంటిపేరైన ‘కల్వకుంట్ల’ స్థానంలో, తన భర్త అనిల్ కుమార్ ఇంటిపేరైన ‘దేవనపల్లి’ని స్వీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నిర్ణయం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ‘కల్వకుంట్ల’ పేరు ఉండటం వల్ల, ఆమె మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తారనే ప్రచారానికి ఆస్కారం ఉంటుంది. ఆ విమర్శలను తిప్పికొట్టేందుకే ఆమె ఈ ‘రీబ్రాండింగ్’ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవల కవిత “జనం బాట” యాత్రను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర పోస్టర్లపై ఎక్కడా కేసీఆర్ ఫొటో లేకపోవడం, “చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను, ఆ చెట్టు కింద దుర్మార్గులు ఉన్నారు” అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ మార్పునకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
‘కల్వకుంట్ల’ బ్రాండ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి, ‘దేవనపల్లి కవిత’గా తన సొంత రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకునేందుకే ఆమె సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఆమె పూర్తిస్థాయి స్వతంత్ర రాజకీయాలకు తొలి అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
