తెలంగాణ: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత భిన్నాభిప్రాయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్టీ ముఖ్య నేత కల్వకుంట్ల కవిత, నల్లగొండ జిల్లా నేత జగదీశ్ రెడ్డిపై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తనను విమర్శించిన జగదీష్ రెడ్డిని కవిత “లిల్లీపుట్ నేత”గా సంబోధించడం సంచలనం సృష్టించింది.
జగదీష్ రెడ్డి “కవిత ఎవరు?” అని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆదివారం కవిత మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో స్పందించారు. “కేసీఆర్ లేకుంటే ఆయన ఎక్కడ ఉండేవారు?” అని ప్రశ్నించిన కవిత, నల్లగొండ జిల్లాలో పార్టీ నష్టాలకు అదే నేత కారణమని మండిపడ్డారు.
ఒకే ఒక సీటు గెలిచినప్పటికీ, మిగిలిన చోట బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యారంటూ ఆరోపించారు. ఇటు, ఇంటి ఆడపడుచుపైనే అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ, పార్టీ నాయకులు స్పందించకపోవడం దురదృష్టకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవన్నీ ఒక పెద్ద నేత శ్రేయస్సులో జరుగుతున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. “ఆయన చెప్పినదే ఈ లిల్లీపుట్ నేత మాట్లాడుతున్నారు” అంటూ పెద్ద నేతపై అసంతృప్తిని బయటపెట్టారు.
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి “మూడు అడుగుల రెడ్డి”గా పేర్కొన్న వ్యక్తినే ఇప్పుడు కవిత కూడా పరోక్షంగా లక్ష్యంగా చేసుకోవడం విశేషం. పలువురు మంత్రులు కూడా జగదీష్ రెడ్డిపై వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ లో లోపలి గొడవల తీవ్రతను తెలియజేస్తోంది. కవిత మాటల్లోనూ పార్టీలోని అనేక అంతర్గత సమస్యలు కనిపిస్తున్నాయి.
