
న్యూస్ డెస్క్: తెలంగాణలోని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అవకతవకల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణ జరిపేందుకు 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ప్రాజెక్ట్ నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలు, ఖర్చుల పెరుగుదల వంటి అంశాలపై గత 15 నెలలుగా కమిషన్ పరిశీలన జరిపింది.
కమిషన్ సభ్యులు ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణాన్ని పరిశీలించారు. మొత్తం 115 మందిని పిలిపించి సాక్ష్యాలను నమోదు చేశారు.
వివిధ దశల్లో ప్రాజెక్ట్ నిర్వహణ, పనుల నాణ్యత, అవకతవకలు జరిగిన ప్రాంతాలు, తదితర అంశాలపై కమిషన్ లోతుగా విచారణ చేపట్టింది. వివరంగా పరిశీలించిన తర్వాత తుది నివేదికను సిద్ధం చేసింది.
తాజాగా ఈ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు సీల్డ్ కవర్‌లో అధికారికంగా అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెరిచి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా నివేదికలో చేసిన సూచనలను పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్ సంస్థలకు సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన మానిప్యులేషన్, నిధుల వాడకంపై కమిషన్ నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నివేదిక బయటకు వస్తే, రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు చోటుచేసుకోవచ్చని అంటున్నారు.
