
‘కే ర్యాంప్’ మూవీ రివ్యూ: అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
కథ
కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) బాగా డబ్బున్న తండ్రికి ఒక్కడే కొడుకు. కానీ అతనికి చదువు, బాధ్యత అస్సలు పడవు. ఎప్పుడూ తాగుడు, స్నేహితులతో అల్లరి తప్ప వేరే ధ్యాస ఉండదు. కొడుకును మార్చాలని తండ్రి అతన్ని కేరళలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి మరీ చేర్పిస్తాడు. అక్కడికి వెళ్లినా కుమార్ బుద్ధి మారదు.
అలాంటి టైంలోనే కుమార్ కు మెర్సీ (యుక్తి తరేజా) పరిచయమవుతుంది. ఆమె చేసే చిన్న చిన్న సాయాలకు కుమార్ బాగా ఇంప్రెస్ అవుతాడు. ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు, మెర్సీ కూడా నెమ్మదిగా ఇతడి ప్రేమను ఒప్పుకుంటుంది. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో, మెర్సీకి ఉన్న ఒక పెద్ద సమస్య గురించి కుమార్ కి తెలుస్తుంది. అసలు ఆ సమస్య ఏంటి? దాని వల్ల కుమార్ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది అసలు కథ.
విశ్లేషణ
‘కే ర్యాంప్’ సినిమా మొదటి అరగంట చూస్తే, కిరణ్ అబ్బవరం మళ్లీ పాత ట్రాక్‌లోకి వెళ్లాడా అనిపిస్తుంది. హీరో తాగుతూ, హీరోయిన్ చుట్టూ తిరుగుతూ.. ఒక రొటీన్ లవ్ స్టోరీలా సాగుతుంది. నిజానికి, సినిమాలో హీరో పాత్రను ఎక్కువ తాగే వ్యక్తిగా చూపించడం కొంతమంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ సన్నివేశాలు కూడా చాలా సిల్లీగా, ఎప్పుడో చూసినట్లుగా అనిపిస్తాయి. కొత్త డైరెక్టర్ జైన్స్ నాని.. యూత్‌ని టార్గెట్ చేసి రాసుకున్న సీన్లు అంచనాలను అందుకోలేకపోయాయి.
కానీ, ఎప్పుడైతే కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అవుతుందో, అక్కడి నుంచి సినిమా గేర్ మారుతుంది. హీరోయిన్ క్యారెక్టర్‌కి ఉన్న డిజార్డర్ చుట్టూ అల్లిన సన్నివేశాలు బాగా పండాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు సెకండాఫ్ మంచి ఫీడ్ ఇస్తుంది. ముఖ్యంగా, కన్సిస్టెన్సీ లేని హీరోయిన్ వల్ల హీరో పడే ఇబ్బందులు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని చోట్ల కొంచెం లౌడ్ గా అనిపించినా, కామెడీ వర్కవుట్ అవ్వడం ప్లస్ పాయింట్.
కామెడీకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే.. సెకండాఫ్‌లో వచ్చే వెన్నెల కిషోర్ ఎపిసోడ్. ఇది సినిమాకే హైలైట్. కామెడీ టైమింగ్‌తో కిషోర్ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. సినిమా చివర్లో కథకు ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించినా, అది పెద్దగా కనెక్ట్ అవ్వదు. మొత్తం మీద చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ విసుగు తెప్పించినా, సెకండాఫ్ క్రేజీ కామెడీ ట్రాక్ వల్ల ఈ సినిమాను ‘పర్వాలేదు’ అనిపించేలా ముగిసింది.
ప్లస్ పాయింట్స్
సెకండాఫ్‌లో వచ్చే కామెడీ, ట్విస్ట్.
వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ పాత్రల కామెడీ ట్రాక్.
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రొటీన్‌గా, స్లోగా ఉండటం.
అవసరం లేకున్నా ఎక్కువ తాగే హీరో పాత్ర, లౌడ్ నరేషన్.
క్లైమాక్స్‌లో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం.
రేటింగ్ – 2.5/5
