
జూబ్లీహిల్స్: ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉండటం ఇప్పుడు బీఆర్ఎస్‌ను నిస్తేజంలోకి నెట్టింది. అయితే, ఈ ఫలితం ప్రతిపక్షాలపై ప్రభావం చూపడం కన్నా, అధికార కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లోనే పెను మార్పులకు దారితీస్తుందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఈ ఉప ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి తన నాయకత్వానికి “మినీ రిఫరెండం”గా భావించారు. సీఎం అయి రెండేళ్లవుతున్నా, ఢిల్లీ కేంద్రంగా కొందరు సీనియర్లు ఆయనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
ఈ నేపథ్యంలోనే, రేవంత్ ఈ ఎన్నికను జీవన్మరణ సమస్యగా తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, వారం రోజుల పాటు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేయడం అసాధారణం. అంతేకాకుండా, మిత్రపక్షం ఎంఐఎంను కలుపుకొని పక్కా వ్యూహంతో ముందుకు సాగారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై, కాంగ్రెస్ జెండా ఎగిరితే, అది రేవంత్ రెడ్డికి తిరుగులేని విజయం అవుతుంది. పార్టీపై, ప్రభుత్వంపై ఆయనకు పూర్తి పట్టు లభిస్తుంది. ఢిల్లీలోని ఆయన వ్యతిరేక వర్గానికి ఇది గట్టి సమాధానంగా నిలుస్తుంది.
