
తెలంగాణ: ఏకైక ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభుత్వ స్థిరత్వాన్ని ప్రభావితం చేయకపోయినా, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారింది. అధికార కాంగ్రెస్ తన పట్టు నిరూపించుకోవాలని, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని పూర్వ వైభవం చాటాలని, బీజేపీ అనూహ్య విజయం సాధించి సత్తా చూపాలని తహతహలాడుతున్నాయి.
ఈ త్రిముఖ పోరులో బీజేపీ పరిస్థితి కాస్త క్లిష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే చూస్తూ, పరస్పరం ఆ పార్టీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించుకుంటున్నాయి. దీనికి తోడు, అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, ప్రచారంలో జోరు లేకపోవడం కమలనాథులకు ప్రతికూలంగా మారుతోంది. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ సుమారు 25 వేల ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో ఆ ఓట్లను నిలబెట్టుకుని, మరింత పెంచుకుంటేనే పార్టీ పరువు దక్కుతుంది.
అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉండటం బీజేపీకి ఆశాకిరణంగా మారింది. టీడీపీ, జనసేన పార్టీలకు ఇక్కడ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు అంటున్నా, ఈ ఓట్లు తమకే పడాలని, ఆ పార్టీల నుంచి పరోక్ష సహకారం లభించాలని కమలనాథులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బాహాటంగా మద్దతు కోరితే ‘ఆంధ్రా పార్టీ’ ముద్ర పడుతుందనే భయం వారిని వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో, బీజేపీ అధిష్టానం ఓ కొత్త వ్యూహానికి పదును పెట్టినట్లు సమాచారం. ఏపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు, అక్కడి కీలక బీజేపీ నేతలను ప్రచార బరిలోకి దించాలని యోచిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వంటి నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ నేతల ప్రచారం ద్వారా అక్కడి ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని బీజేపీ లెక్కలు వేస్తోంది. ప్రచారంలో ఇప్పటికే వెనుకబడిన ఆ పార్టీ, ఈ వ్యూహంతోనైనా గట్టెక్కాలని చూస్తోంది. గెలుపుపై పూర్తి ధీమా లేకపోయినా, కనీసం మెరుగైన ప్రదర్శన కనబరిచి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.
అయితే, ఏపీ నేతలను ప్రచారానికి తీసుకురావడంపై ప్రత్యర్థి పార్టీలు ఎలా స్పందిస్తాయో, దీన్ని వారు రాజకీయంగా ఎలా వాడుకుంటారో చూడాలి. ఏపీ ఓటర్లు, పార్టీల మద్దతు బీజేపీకి ఎంతవరకు లభిస్తుందో, ఈ వ్యూహం ఫలితాలనిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
