
న్యూస్ డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో పేస్‌కు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయని చెత్త రికార్డును ఇంగ్లండ్ మేటి క్రికెటర్ జో రూట్ చెరిపేశాడు. గురువారం మొదలైన రెండో (గులాబీ బంతి) యాషెస్ టెస్టులో రూట్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు.
15 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో దాదాపు 14 వేల పరుగులు చేసిన రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం 30 ఇన్నింగ్స్ ఆడినా సెంచరీ కొట్టలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అభిమానులు అతన్ని గేలి చేశారు. తొలి టెస్టులో డకౌట్ అయిన రూట్.. ఈసారి ఒత్తిడిలో మూడంకెల స్కోరు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్‌ను ఆసీస్ పేసర్ స్టార్క్ గులాబీ బంతితో బెంబేలెత్తించాడు. ఓపెనర్ డకెట్ (0), పోప్ (0)లను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 5 పరుగులే.
ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్‌కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. 2 పరుగుల వద్ద అతడి క్యాచ్‌ను ఫీల్డర్ జారవిడిచాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రూట్ క్రీజులో పాతుకుపోయాడు.
ఒకవైపు రూట్ సెంచరీ వైపు వెళ్తుంటే ఆసీస్ పేసర్లు మరో ఎండ్‌లోని వికెట్లను వరుసగా పడగొడుతూ సవాల్ విసిరారు. 246 పరుగులకే ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయింది. అయితే, 11వ నంబర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్ (32 నాటౌట్) అండగా రూట్ సెంచరీని అందుకున్నాడు.
ఇది అతడికి 40వ టెస్ట్ సెంచరీ. సచిన్ (51), కాలిస్ (45), పాంటింగ్ (41) తర్వాత 40 అంతకంటే ఎక్కువ టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్ గా రూట్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆట ముగిసే సరికి రూట్ 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
