
న్యూస్ డెస్క్: ‘మొంథా‘ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పర్యటన చేపట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో బాధితులను పరామర్శించేందుకు ఆయన బయలుదేరారు. అయితే, ఈ పర్యటన తీవ్ర గందరగోళం, ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.
మాజీ సీఎం పర్యటనకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. కాన్వాయ్‌లో 10 వాహనాలకు, 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలకు సైతం నోటీసులు జారీ చేసి, పర్యటనకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
అయితే, పోలీసుల ఆంక్షలను వైసీపీ శ్రేణులు లెక్కచేయలేదు. వందలాది వాహనాల్లో, వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు జగన్ కాన్వాయ్‌ను అనుసరించారు. దీంతో మచిలీపట్నం హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పర్యటనలో డీజే వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలోనే ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్‌లోనే ప్రమాదం జరిగింది. కార్యకర్తల తాకిడికి కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం.
మరోచోట, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిబంధనల పేరుతో పోలీసులు తమ నేత పర్యటనను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆంక్షలు, గందరగోళం, ట్రాఫిక్ జామ్‌ల మధ్య జగన్ పర్యటన కొనసాగుతోంది.
