
న్యూస్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత విజయాన్ని అందుకుంది. భారత నౌకాదళం (Indian Navy) కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను విజయవంతంగా నింగిలోకి పంపింది.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ‘బాహుబలి’ రాకెట్ LVM3-M5 ఈ ప్రయోగాన్ని మోసుకెళ్లింది.
GSAT-7Rగా పిలిచే ఈ ఉపగ్రహం, నావికాదళం యొక్క అంతరిక్ష ఆధారిత సమాచార వ్యవస్థను, సముద్ర జలాలపై నిఘా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.
సుమారు 4,400 కిలోల బరువున్న ఈ CMS-03, భారతదేశం ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో అత్యంత బరువైనది కావడం విశేషం.
నిర్ణీత సమయానికి రాకెట్ నుంచి ఉపగ్రహం కచ్చితత్వంతో విడిపోయిందని, ఇంజెక్షన్ ప్రక్రియ సంపూర్ణంగా విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం దేశ రక్షణ రంగంలో మరో కీలక ముందడుగుగా నిలిచింది.
