
పశ్చిమాసియా మరోసారి యుద్ధ భయాలను ఎదుర్కొంటోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఉల్లంఘనకు గురైంది.
ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కేవలం రెండు గంటల్లోనే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగించడంతో ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలని సూచించారు. దాడికి గట్టిగా బదులిస్తామని రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు.
ఇరాన్ ప్రకటనలలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారితీసింది. తాము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇంకా అంగీకరించలేదని ఒకవైపు చెబుతూనే, సైనిక చర్యలు ముగిశాయనే సంకేతాలు ఇచ్చింది.
ఇప్పటికే ఇజ్రాయెల్ వైమానిక దళాలు అప్రమత్తమై ఉండగా, టెహ్రాన్ కీలక కేంద్రాలపై ప్రతిదాడికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
