
న్యూస్ డెస్క్: ఇన్ఫోసిస్ కంపెనీ ఈ ఏడాది భారీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 17,000 మందిని ఉద్యోగులకు అవకాశాలు కల్పించినట్లు సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. 2025 సంవత్సరంలో మొత్తంగా 20 వేల మందిని నియమించుకునే యోచనలో ఉన్నామని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నామని, యువతకు ఐటీ రంగంలో స్థిరమైన భవిష్యత్తు కల్పించాలన్నదే తమ లక్ష్యమని సీఈవో వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో ఉన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్నప్పటికీ, నూతన ఉద్యోగులకు అవకాసాలు కల్పించడం ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో కంపెనీ ముందుగానే అడుగులు వేసిందని, ఇప్పటి వరకు 2.75 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ, రీస్కిల్లింగ్ ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. కొత్త టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉద్యోగుల్లో పెంచేలా నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఇటీవలే టీసీఎస్ 12,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ నియామకాలు విశేషంగా నిలుస్తున్నాయి. ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్న ఆశలుకూడా ఈ ప్రకటనతో పెరిగాయి.
ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాలు దేశంలో యువతకు, టెక్ రంగ అభివృద్ధికి మంచి సంకేతంగా మారనున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
