
న్యూస్ డెస్క్: మొన్నటి పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ సింధూర్ యుద్ధం తర్వాత డ్రోన్ల దాడి విషయంలో భారత ఆర్మీ స్వయంశక్తి సాధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ కంపెనీ ఒక కీలక మైలురాయిని అధిగమించింది.
దేశంలోనే మొట్టమొదటి యాంటీ డ్రోన్ నిఘా వాహనం ‘ఇంద్రజాల్ రేంజర్’ను ఈ సంస్థ ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక వాహనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తూ దేశ భద్రతకు అపూర్వమైన రక్షణ కవచాన్ని అందిస్తోంది.
ఇప్పటివరకు ఉన్న యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఒక చోట స్థిరంగా ఉన్నప్పుడే పనిచేస్తాయి. కానీ ఇంద్రజాల్ రేంజర్ కదులుతూనే ఆకాశంలో ఎగురుతున్న శత్రు డ్రోన్లను పసిగట్టగలదు వాటి గమనాన్ని పరిశీలించి మట్టుపెట్టగలదు.
ఈ వాహనం స్కైఓఎస్ అనే ప్రత్యేకమైన అటానమీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ప్రమాదాన్ని అంచనా వేసి, డ్రోన్లను అడ్డుకుని, కూల్చేయగల స్వతంత్రంగా పనిచేయగల సామర్థ్యం దీని సొంతం.
ఇంద్రజాల్ రేంజర్ వాహనాలు సరిహద్దుల రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ వంటి నెట్‌వర్క్‌లు డ్రోన్ల సాయంతో ఆయుధాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భారత్‌లోకి సరఫరా చేస్తున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం పెరిగింది.
ఈ టెక్నాలజీ యువతకు సురక్షితమైన దేశం అందించడానికి భవిష్యత్తుకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే పేర్కొన్నారు.
