
న్యూస్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో కొత్త ట్రాఫిక్ నియమాలు తీసుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి ‘నో హెల్మెట్ నో పెట్రోల్’ నియమాన్ని అక్కడ అధికారికంగా అమలు చేయబోతున్నారు. అంటే, ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కి వెళితే వారికి పెట్రోల్ ఇవ్వకుండా తిరస్కరించనున్నారు.
ఈ నిర్ణయాన్ని జిల్లా యంత్రాంగం ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో తీసుకుంది. రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాలతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హెల్మెట్ వేసుకోకుంటే ఇంధనం నింపకూడదని పెట్రోల్ బంకులకు స్పష్టంగా తెలిపారు.
పెట్రోల్ పంపు యజమానులు ఈ ఆదేశాలు పాటించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ హెచ్చరించారు. ఇది ఉల్లంఘిస్తే ఏడాది జైలు లేదా ఐదు వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అవసరమైతే రెండూ కూడా ఉండొచ్చు.
ఇండోర్‌లో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనపై ఇటీవల హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇలా ప్రజల ప్రాణభద్రత కోసం కొత్త నిబంధనను అధికారికంగా అమలు చేయాలని నిర్ణయించారు.
