
న్యూస్ డెస్క్: అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థి ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి (28) లుఫ్తాన్సా విమానంలో అరాచకం సృష్టించిన కేసులో బోస్టన్ కోర్టులో నిలిచారు. విమానంలో ఇద్దరు మైనర్ ప్రయాణికులపై హింసాత్మక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ దారుణం అక్టోబర్ 25న చికాగో నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్తున్న విమానంలో జరిగింది. భోజనం పూర్తయిన తర్వాత, ప్రణీత్ లోహపు ఫోర్క్‌తో నిద్రిస్తున్న 17 ఏళ్ల యువకుడిని భుజంపై పొడిచాడు. ఆ వెంటనే, పక్కనే ఉన్న మరో మైనర్ తల వెనుక భాగాన్ని గాయపరిచాడు.
దాడిని ఆపడానికి వచ్చిన విమాన సిబ్బందిని కూడా ప్రణీత్ హింసించినట్లు సాక్షులు తెలిపారు. తుపాకీ ఆకారంలో చేతిని పెట్టి ‘ట్రిగ్గర్’ లాగినట్లు నటించడం, ఒక మహిళా ప్రయాణికురాలిని చెంపదెబ్బ కొట్టడం వంటివి చేసినట్లు సిబ్బంది తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ప్రణీత్ ప్రవర్తన అదుపు తప్పడంతో విమానాన్ని బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. ల్యాండ్ అయిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో దాఖలైన పత్రాల ద్వారా మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ దాడి జరిగిన సమయానికి చట్టబద్ధ విద్యార్థి హోదాలో లేడని ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
ప్రణీత్‌పై మోపబడిన “విమానంలో హింసాత్మక దాడి” ఆరోపణలు రుజువైతే, అతనికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, దాదాపు ₹2 కోట్ల ($250,000) వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
