Friday, December 12, 2025
HomeBig StoryWomen's Cricket World Cup: కల తీరింది.. తొలిసారి జగజ్జేతగా భారత మహిళలు

Women’s Cricket World Cup: కల తీరింది.. తొలిసారి జగజ్జేతగా భారత మహిళలు

india-women-win-world-cup-2025-beat-south-africa-in-final

న్యూస్ డెస్క్: Women’s Cricket World Cup: దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. భారత మహిళల క్రికెట్ స్వప్నం సాకారమైంది. కపిల్ గ్యాంగ్ ’83’ విజయంలా, అమ్మాయిల క్రికెట్ రూపురేఖలను మార్చేసే చిరస్మరణీయ విజయం సొంతగడ్డపై, వేలాది మంది అభిమానుల సాక్షిగా ఆవిష్కృతమైంది. ఆదివారం నవీ ముంబైలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి, హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇది నిస్సందేహంగా అమ్మాయిల ’83’.

ఈ ఫైనల్ పోరులో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్, యువ ఓపెనర్ షెఫాలి వర్మ (87) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేసుకుంది. ఆమెకు తోడు స్మృతి మంధాన (45) రాణించగా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) విలువైన పరుగులు జోడించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) అద్భుత శతకంతో ఒంటరి పోరాటం చేసింది. ఓ దశలో ఆమె క్రీజులో ఉండటంతో దక్షిణాఫ్రికా గెలుపు దిశగా సాగినట్లు కనిపించింది. అయితే, కీలక సమయంలో బంతి అందుకున్న దీప్తి శర్మ మాయ చేసింది. డేంజరస్ వోల్వార్ట్‌తో పాటు, డెర్క్‌సెన్, ట్రయాన్, డిక్లెర్క్‌ వంటి కీలక బ్యాటర్లను ఔట్ చేసింది.

మరో అనూహ్య మలుపుగా, పార్ట్‌టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మ బంతితోనూ మ్యాజిక్ చేసింది. ఆమె లుజ్, కాప్‌లను వరుస ఓవర్లలో ఔట్ చేసి దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌ను దెబ్బతీసింది. తెలుగమ్మాయి శ్రీచరణి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్ తీసింది. వీరి ధాటికి దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే కుప్పకూలింది.

దీప్తి శర్మ 5 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించడమే కాకుండా, బ్యాట్‌తోనూ హాఫ్ సెంచరీ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచింది. షెఫాలి వర్మ బ్యాటింగ్‌తో పాటు, బౌలింగ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. 2005, 2017లలో ఫైనల్‌కు చేరినా కప్పు గెలవలేకపోయిన భారత్, మూడో ప్రయత్నంలో మాత్రం పట్టుదలతో పోరాడి విశ్వవిజేతగా నిలిచింది.

ఈ విజయంతో, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తర్వాత మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన నాలుగో జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. కపిల్ దేవ్ (1983), ఎంఎస్ ధోనీ (2011) తర్వాత, వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డులకెక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular