
న్యూస్ డెస్క్: దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా తన అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు. కెప్టెన్‌గా 11 టెస్టులకు నాయకత్వం వహించిన బవుమా, 10 విజయాలు, 1 డ్రాతో ‘అన్‌బీటెన్’ కెప్టెన్‌గా నిలిచాడు. WTC ఫైనల్ గెలిచిన అతను, ఇప్పుడు భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించాడు. 15 ఏళ్ల తర్వాత భారత్‌లో దక్షిణాఫ్రికా టెస్టు గెలవడం ఇదే తొలిసారి.
కోల్‌కతా టెస్టులో 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా ఘోరంగా విఫలమైంది. భారత బ్యాటర్లు 93 పరుగులకే కుప్పకూలి, 30 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. యశస్వి (0), రాహుల్ (1), కెప్టెన్ పంత్ (2) దారుణంగా విఫలమయ్యారు.
ఈ ఓటమికి అసలు కారణం భారత్ పన్నిన స్పిన్ ఉచ్చు బెడిసికొట్టడమే. భారత స్పిన్నర్ల కోసం పిచ్‌ను సిద్ధం చేయగా, దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్ 8 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మన బ్యాటర్లు సొంత పిచ్‌పైనే స్పిన్ ఆడలేకపోయారు.
కెప్టెన్ బవుమా బ్యాటింగ్‌తోనూ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 93/7తో కష్టాల్లో ఉన్న జట్టును, అజేయ హాఫ్ సెంచరీ (55*)తో ఆదుకున్నాడు. అతను జోడించిన పరుగులే చివరికి మ్యాచ్‌ను మలుపు తిప్పాయి.
ఓటమి అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, “మాకు ఇలాంటి పిచ్‌లే కావాలి” అని క్యూరేటర్‌ను వెనకేసుకొచ్చారు. అయితే, సొంతగడ్డపై ఆడిన గత 6 టెస్టుల్లో భారత్ 4వ సారి ఓడిపోవడం గమనార్హం.
