
న్యూస్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై పాకిస్థాన్ చేసిన తప్పుడు ఆరోపణలకు భారత విదేశాంగ శాఖ గట్టిగా సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశం యొక్క ‘పాత అలవాటే’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యం ఇస్తుందని, ఉగ్రవాద కార్యకలాపాలను స్పాన్సర్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఆఫ్ఘనిస్తాన్ తన సొంత భూభాగాలపై సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడం పట్ల పాకిస్తాన్ కోపంగా ఉందని జైస్వాల్ అన్నారు. అయితే, ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల మధ్య కాబూల్‌లోని భారతదేశ సాంకేతిక మిషన్ పూర్తి స్థాయి రాయబార కార్యాలయంగా మారుతుందని జైస్వాల్ తెలిపారు. ఈ ప్రకటన ద్వారా న్యూఢిల్లీ ఆఫ్ఘన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకుంటూ, ఆ దేశానికి గట్టి మద్దతు ఇస్తోందన్న సంకేతాలు పంపింది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతకుముందు భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయాలు కాబూల్‌లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని, ఆఫ్ఘన్ తాలిబన్లు న్యూఢిల్లీ తరపున పాకిస్థాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటించడంపైనా ఆయన అక్కసు వెళ్లగక్కారు.
పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన దాడుల్లో అనేక మంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. మరోవైపు, పాకిస్తాన్ సైన్యం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులను హతమార్చామని తెలిపింది.
