
న్యూస్ డెస్క్: దేశంలోని 734 జిల్లుల్లో 417 జిల్లాలు తీవ్రమైన వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయని ‘శక్తి పర్యావరణం, నీటి మండలి’ (CEEW) తాజాగా ప్రకటించింది. ఇది దేశ జనాభాలో 76 శాతం మంది ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది.
ఈ అధ్యయనం ప్రకారం, అత్యధిక ఉష్ణోగ్రతల పీక్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. రాత్రిపూట కూడా వేడి తగ్గకపోవడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.
1982-2022 మధ్యకాల వాతావరణ గణాంకాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. భూ వినియోగం, నీటి వనరులు, జనసాంద్రత, ఆర్థిక స్థితిగతులు కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
734 జిల్లాల్లో 151 జిల్లాలు అధిక ప్రమాదంలో, 266 జిల్లాలు చాలా అధిక ముప్పులో ఉన్నాయని నివేదిక పేర్కొంది. రాత్రి వేడి అధికంగా ఉండటం వల్ల శరీరం చల్లబడే అవకాశం తగ్గి, హీట్ స్ట్రోక్ ముప్పు పెరుగుతోంది.
పబ్లిక్ హెల్త్, నగర ప్రణాళికలో వేడి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాల్సిన అవసరం ఉందని CEEW హెచ్చరించింది.
