
న్యూస్ డెస్క్: అంచనాలకు భిన్నంగా తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ రిపోర్టు 2025 సంచలన విషయాలను వెల్లడించింది. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా భారత్ కు చెందిన విద్యార్థులే ఉన్న విషయం స్పష్టమైంది.
ట్రంప్ ప్రభుత్వ విధానాల వల్ల భారత విద్యార్థులు అంత ఆసక్తి చూపడం లేదన్న మాటలో నిజం లేదని తాజా గణాంకాలు నిరూపించాయి. గత ఏడాది కంటే ఎక్కువగా భారత విద్యార్థులు ఈ ఏడాది ఉన్నత చదువు కోసం అమెరికాకు వచ్చారు.
గత విద్యా సంవత్సరం 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ అగ్రస్థానంలో నిలవగా, ఈ విద్యా సంవత్సరంలో (2024-25) ఆ సంఖ్య 3.62 లక్షలకు పెరిగింది.
గత ఏడాది ముందు వరకు అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో చైనా ముందుండేది. కానీ 2023-24 నుంచి భారత విద్యార్థులు పెరుగుతుంటే, చైనా విద్యార్థుల సంఖ్య మాత్రం 4 శాతం తగ్గింది. భారత్ విద్యార్థులు 10 శాతం ఎక్కువగా అమెరికాకు వచ్చారు.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల్లో 57 శాతం మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) కోర్సులు చదువుతున్నారు.
మొత్తం భారత విద్యార్థుల్లో 43.4 శాతం మంది కంప్యూటర్ సైన్స్, 22.8 శాతం ఇంజినీరింగ్, 11.30 శాతం బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.
