
న్యూస్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారనే విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. బలుచిస్థాన్ విదేశాంగ శాఖ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, ఆయన్ను పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐఎస్ఐ కలిసి హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయని పోస్టు చేసింది.
దీంతో రావల్పిండిలోని అడియాలా జైలు ముందు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఇమ్రాన్ క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఆయన ముగ్గురు సోదరీమణులు సైతం జైలుకు వెళ్లారు.
అయితే పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఒక్కసారిగా ఆ ఏరియాలో వీధి లైట్లు ఆపేసి, చీకట్లో వారిపై దాడి చేశారు. 71 ఏళ్ల సోదరి నౌరీన్ ఖాన్‌ను జుట్టు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకెళ్లారని వార్తలు వచ్చాయి.
ఈ దారుణ దాడిపై పంజాబ్ పోలీస్ చీఫ్‌కు ఖాన్ సోదరీమణులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై క్రూరమైన దాడి చేశారని వారు ఆరోపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జైలు అధికారులు స్పందించారు. ఇమ్రాన్ ను తరలించారనే వార్తల్లో నిజం లేదని, ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదవి పేర్కొన్నారు.
అయితే ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు ఉన్నా, సుమారు నెల రోజులకు పైగా కుటుంబ సభ్యులను కలవకుండా ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించింది. ఈ ఏకాంత నిర్బంధమే పుకార్లకు దారి తీస్తోంది.
