
సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే, అదీ హై క్వాలిటీ ప్రింట్‌తో పైరసీ సైట్‌లో ప్రత్యక్షమైతే నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. నాని నిర్మించిన ‘హిట్ 3’ సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. రిలీజ్‌కు దాదాపు 18 గంటల ముందే ఈ సినిమా ‘ఐబొమ్మ’లో స్ట్రీమ్ అవ్వడం అప్పట్లో ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది.
అసలు ఇంత క్లియర్ ప్రింట్ ఎలా బయటకు వెళ్లిందనే ప్రశ్న అందరినీ తొలచివేసింది. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు అనుమానం మొదట వెళ్ళేది సొంత టీమ్ మీదే. ఎడిటింగ్ రూమ్‌లోనో, పోస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్‌లోనో ఎవరో నమ్మకద్రోహం చేశారని, డబ్బు కోసం ఫైల్ లీక్ చేశారని ప్రొడక్షన్ హౌస్ భావించింది.
దీనివల్ల ‘హిట్ 3’ టీమ్‌లో అనవసరమైన అనుమానాలు, ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తమతో కలిసి పనిచేసేవారే వెన్నుపోటు పొడిచారన్న బాధ నిర్మాతలను వెంటాడింది.
కానీ, తాజాగా ఐబొమ్మ రవి అరెస్ట్‌తో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ‘హిట్ 3’ లీక్ వెనుక ఆఫీస్ బాయ్స్ లేరు, టెక్నీషియన్స్ లేరు. అది పక్కాగా రవి వేసిన సైబర్ స్కెచ్. అతను ఏకంగా సినిమా ఫైల్స్ దాచిన సర్వర్లనే హ్యాక్ చేసి, కంటెంట్‌ను దొంగలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. లోపలి మనిషి సాయం లేకుండానే, టెక్నాలజీని వాడి సినిమాను ఎత్తుకెళ్లడం రవి నెట్‌వర్క్ సామర్థ్యానికి నిదర్శనం.
ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక డేంజర్ బెల్ లాంటిది. కేవలం ఓటీటీలో వచ్చాక రికార్డ్ చేసి పెట్టడం కాదు, ఏకంగా రిలీజ్‌కు ముందే సర్వర్లను బ్రేక్ చేసే స్థాయికి పైరసీ దారులు వెళ్లడం ఆందోళన కలిగించే అంశం. రవి ఈ టెక్నిక్ వాడే ‘హిట్ 3’ని థియేటర్ రిలీజ్ కంటే ముందే జనాలకు చూపించేశాడు. దీనివల్ల నిర్మాతలకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.
ఇన్నాళ్లూ తమ ఉద్యోగులనే అనుమానిస్తున్న నిర్మాణ సంస్థలకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దొంగ ఇంట్లో లేడు, ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నాడని అర్థమైంది. ఈ హ్యాకింగ్ ఉదంతంతోనైనా ఇండస్ట్రీ తమ డిజిటల్ సెక్యూరిటీని, సర్వర్ల రక్షణను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
