
న్యూస్ డెస్క్: ‘ఐ-బొమ్మ‘ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించింది. ఈ పైరసీ రాకెట్ వెనుక ఉన్న కీలక విషయాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు కూడా పాల్గొని, పైరసీపై ఉక్కుపాదం మోపిన పోలీసులను అభినందించారు.
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. “పైరసీ అనేది దేశవ్యాప్త సమస్య, దీనివల్ల పరిశ్రమకు వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని పట్టుకున్నాం” అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 కేసులు నమోదు చేశామని, దుద్దెల శివరాజ్, ప్రశాంత్‌లను ముందే అరెస్ట్ చేశామని చెప్పారు.
ఇమ్మడి రవి గురించి సజ్జనార్ సంచలన విషయాలు బయటపెట్టారు. “రవి బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన వేలాది సినిమాలు పైరసీ చేశాడు. అతని నుంచి రూ. 3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం, కానీ అతను రూ. 20 కోట్ల వరకు సంపాదించినట్లు ఒప్పుకుంటున్నాడు” అని తెలిపారు.
అంతేకాకుండా, రవి వద్ద 50 లక్షల మంది ‘ఐ-బొమ్మ’ సబ్‌స్క్రైబర్ల డేటా ఉందని, ఆ డేటాను డార్క్ వెబ్‌కు అమ్మే ప్రమాదం కూడా ఉండేదని సజ్జనార్ హెచ్చరించారు. ఈ పైరసీ ముసుగులోనే బెట్టింగ్ యాప్స్‌ను కూడా ప్రమోట్ చేశారని, వాటివల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రవి మొదటినుంచీ క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి అని, మహారాష్ట్రలో ‘ప్రహ్లాద్’ పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ సృష్టించాడని వెల్లడించారు. అమెరికా, నెదర్లాండ్స్‌లో సర్వర్లు పెట్టి, ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ తిరుగుతూ కరేబియన్ ఐలాండ్ సిటిజన్‌షిప్ కూడా తీసుకున్నాడని సీపీ తెలిపారు.
