
న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో భారీ పారిశ్రామిక పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. హ్యుందాయ్ మోటార్స్ దేశంలో రూ. 45 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడంతో, చంద్రబాబు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తోంది.
గతంలో కియా మోటార్స్‌ను విజయవంతంగా తీసుకొచ్చిన అనుభవం ఉండటంతో, ఈ భారీ ఆటోమొబైల్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనంతపురం అనువైన ప్రదేశంగా ప్రతిపాదనలు పంపాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.
కరువు సీమ అయిన అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి, అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో హ్యుందాయ్ పరిశ్రమ కూడా అదే ప్రాంతానికి వస్తే ఆటోమొబైల్ రంగంలో ఏపీకి మరింత బలం చేకూరుతుంది.
హ్యుందాయ్ మోటార్స్ 2029-30 నాటికి దేశంలో రూ. 45 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడులతో భారత ఆటోమొబైల్ ఎగుమతుల్లో తమ వాటాను 30 శాతానికి పెంచాలని భావిస్తోంది. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్లలో మరో 26 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది.
ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోన్న ఎలక్ట్రిక్ ఎస్.యూ.వీ.లను స్థానికంగా తయారు చేయాలని భావిస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ఎలక్ట్రిక్ పరిశ్రమకు అనువైన ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
16 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రూ. 11.50 లక్షల కోట్లు పెట్టుబడులను తీసుకువచ్చారు. ఇటీవల గూగుల్‌తో రూ. 1.36 లక్షల కోట్లతో డేటా సెంటర్, ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. హ్యుందాయ్ మోటార్స్ సీఈవో జోస్ మునోజ్ ఈ ప్రకటన చేయడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అంతేకాకుండా, హ్యుందాయ్ మోటార్ ఇండియాకు తొలి భారతీయ సీఈవోగా తరుణ్ గార్గ్‌కు పదోన్నతి దక్కడం, స్థానిక పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉండటం ఏపీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.
