
న్యూస్ డెస్క్: ఈ వారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠినంగా వ్యవహరిస్తుండటం, డాలర్ బలపడటం వల్ల పసిడి ధరలపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు తాత్కాలికంగా వెనుకడుగేస్తున్నారు.
ఇండియా బులియన్ జువెలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈ వారాంతానికి రూ.98,534 వద్ద నిలిచింది. వారం మధ్యలో కాస్త పెరిగినా, చివరికి తగ్గుదల నమోదు కావడం గమనార్హం. నిపుణుల అంచనాల ప్రకారం, సమీప భవిష్యత్తులో ధరలు రూ.97,000 – రూ.98,500 మధ్య ఒడిదొడుకుల పాలయ్యే అవకాశం ఉంది.
ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ధర రూ.350 తగ్గి రూ.97,700 వద్ద ట్రేడ్ అవుతుండగా, అమెరికా ఆర్థిక గణాంకాలపై పెట్టుబడిదారుల దృష్టి ఉంది. దీని ప్రభావంతో పసిడి కొనుగోలుదారులకు ఇది తక్కువ ధర వద్ద ఎంట్రీకి అవకాశం కల్పిస్తోంది.
డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ తాజా నివేదిక ప్రకారం, బంగారం ధర 1980 రికార్డును అధిగమించి 2024లో గరిష్టాన్ని చేరిందని తెలిపింది. వెండి ధర మాత్రం పాత గరిష్టాన్ని చేరలేదని చెప్పింది.
అంతర్జాతీయ మారక నిల్వల్లో చిన్న శాతం బంగారంలోకి మళ్లినా, పసిడికి గణనీయమైన వృద్ధి అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
