
న్యూస్ డెస్క్: సాధారణంగానే బైక్స్ అంటే చాలా మందికి పిచ్చి, అందులోనూ సుజుకి హయబుసా లాంటి సూపర్ బైక్ అంటే ఆ క్రేజే వేరు. కానీ, దుబాయ్‌లో కనిపించిన ఈ హయబుసా మాత్రం కేవలం బైక్ కాదు, అదో కదిలే బంగారు ఆభరణం. అవును, ఈ బైక్‌ను ఏకంగా బంగారం, వజ్రాలతో అలంకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఓ మోటార్ షోలో ఈ ప్రత్యేకమైన హయబుసా బైక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. బైక్ బాడీ వర్క్‌లో చాలా భాగం బంగారంతో పూత పూయడమే కాకుండా, పలు చోట్ల విలువైన వజ్రాలను పొదిగారు. చివరికి బైక్‌కు ఉపయోగించిన బోల్టులు కూడా బంగారంతో చేసినవే కావడం విశేషం.
ఈ బైక్‌కు వేసిన ప్రత్యేకమైన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసమే ఏకంగా రూ. 13.3 లక్షలు ఖర్చు చేశారంటే, ఇక మొత్తం బైక్ తయారీకి ఎంత ఖర్చయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ బైక్‌ను చూసిన వారంతా దీని ధర ఊహించడానికి ప్రయత్నించి, అసలు ధర తెలిసి షాక్ అవుతున్నారు.
ఈ బంగారం, వజ్రాల హయబుసా ధర అక్షరాలా రూ. 1.67 కోట్లు! అవును, మీరు చదివింది నిజమే. దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన ఈ బైక్ కేవలం అలంకార ప్రాయమే కాదు, పర్ఫార్మెన్స్‌లోనూ కింగే.
400 హార్స్‌పవర్ ఇంజిన్‌తో దూసుకుపోయే ఈ బైక్, ఆటోమొబైల్ ప్రియులకు కనుల పండుగ చేస్తోంది. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, దీని వెనుక టైర్ పరిమాణం ప్రఖ్యాత బుగట్టి కారు టైర్ కంటే కూడా పెద్దదిగా ఉండటం.
లగ్జరీకి, పవర్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ గోల్డెన్ హయబుసా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంత ఖరీదైన బైక్‌ను ఎవరు సొంతం చేసుకున్నారనే దానిపై మాత్రం స్పష్టత లేదు.
