
న్యూస్ డెస్క్: టాలీవుడ్‌లో కీలకమైన రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. స్టూడియోలు తమ వాణిజ్య ప్రాంతాన్ని తక్కువ చేసి చూపిస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఎగవేస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ.
అధికారుల లెక్క ప్రకారం, అన్నపూర్ణ స్టూడియోస్ రూ. 11.52 లక్షలు, రామానాయుడు స్టూడియోస్ రూ. 2.73 లక్షలు చెల్లించాల్సి ఉంది. పన్ను ప్రయోజనాల కోసం తమ వాస్తవ ప్రాంతం కంటే చాలా తక్కువ ఏరియాను రికార్డుల్లో చూపించాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.
అయితే, రామానాయుడు స్టూడియోస్ తరపున సురేష్ ప్రొడక్షన్స్ దీనిపై వెంటనే స్పందించింది. తాము ఎప్పుడూ ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లిస్తున్నామని నోట్ విడుదల చేసింది. పన్ను ఎగవేశారన్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు.
అంతేకాదు, ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజును జీహెచ్ఎంసీ అమాంతం పెంచిందని సురేష్ ప్రొడక్షన్స్ ఆరోపించింది. గతంలో రూ. 7,614 ఉన్న ఫీజును ఏకంగా రూ. 2.73 లక్షలకు పెంచడం అసంబద్ధమని, దీనిని పునఃపరిశీలించాలని కోరింది.
తమ స్టూడియో బిల్టప్ ఏరియాకు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం లేదని వారు స్పష్టం చేశారు. అలాగే, స్టూడియోస్‌లోని జీహెచ్ఎంసి నిబంధనలను తాము అమలు చేస్తున్నామని, అధికారులతో పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌పై ఆరోపణలు పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ, రామానాయుడు స్టూడియోస్ మాత్రం ఈ నిందను ఖండించింది. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ తుది నిర్ణయం కోసం ఎదురుచూడాలి.
